నిండుగోదారిలా ఉన్న సిటీ బస్సు, అందులో ప్రయాణించి ఇల్లు చేరేసరికి ఒళ్ళు మాత్రమే కాదు మససుకూడా అలసి పోతుంది.. చేతిలో హ్యాండ్ బ్యాగ్, చేతిలో టిఫెన్ బాక్స్ తో నిల్చోవడమే కష్టంగా ఉంది.... ఇది చాలదన్నట్టు వెనక నుండి ఎపుడు మీద పడతారో అన్నట్టు తోసుకుంటూ ముందుకు ముందుకు తోసుకుంటూ ఉన్న జనాలు..
అదిగో అపుడు మొదలైంది అడుగు దూరంలో ఉన్న రెటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న అతను ఊపిరి తగిలెంత దూరంలోకి వచ్చి , పట్టుకొని నించున్నట్టే అనిపిస్తూ మనిషీ మీదకు అంటూ పడిపోతూ ... వెనక్కి తిరిగితే ఒక వెకిలి నవ్వు... అతను చేసే పని తెలుస్తున్నా ...ఏమి అన్నా ఉపయోగం ఉండకపోగా అదో సినిమా కథ అవుతుందని తెలిసి కాస్త సర్ధుకొని ఇంకొంచెం ముందుకు జరిగి నిల్చుంది పూర్ణ ....
అయినా ఆ ప్రహానానానికి అంతే లేకుండా పోయింది... ఏమి చేయలేరనే దైర్యం వచ్చింది కాబోలు ...ఇంకొంచెం ముందుకంటూ జరిగి ఆడవాళ్ళ మధ్యకు చేరి తన చేతులకి పని చెప్పడానికి సిద్దమయ్యాడు. ఏది అయితే అయ్యిందని గట్టిగా అతన్ని గట్టిగా అరచి మందలించడానికి సిద్దమయ్యింది. అంతలోఒక కాలేజీ కుర్రాడు అతిమామూలుగా వచ్చి సీటు కడ్డీ పట్టుకుని నిల్చున్నాడు. ఇపుడు అతనికి, పూర్ణాకి మధ్య లక్ష్మణరేఖలా అడ్డుగా ఉన్నాడు... పూర్ణని చూస్తూ “ఆంటీ” ఇటు నిల్చొండి అంటూ చోటిచ్చాడు. అతని సంస్కారానికి అబ్బురపడింది.... అతన్ని పెంచిన తల్లిదండ్రులకి మనసులో శతకోటి వందనాలు అర్పించింది తన దిగే స్టాప్ రాగానే తన పెదాలు విడి విడకుండా అతనికి వినిపించేట్టు “థాంక్ యు” అని చెప్పగానే,మా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నందుకు ‘సారీ ‘తనకు విన్పించేత మెల్లిగా అయినా స్పష్టంగా చెప్పాడు చిరువవ్వుతో ఆ అబ్బాయి. సంతృప్తిగా దిగి ఇంటిదారి పట్టింది పూర్ణ కొత్తశక్తి నింపుకున్న మనసుతో.